రామాయణ కాలపు జలపాతాలు
పర్యాటకంలో అన్ని వర్గాల వారికీ అమితానందాన్నిచ్చేవి జలపాతాలు. కాని అవి మన రాష్ట్రంలో తక్కువగా ఉండి పర్యాటకంలో జలపాతాల లోటు ఉంది అనుకుంటున్నాం. కాని బాగా తెలుసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే... అదీ ఒక్క మండలంలోనే మూడు జలపాతాలున్నాయని తెలసి ఆశ్చర్యానికి గురై ఆనందించేందుకు బయలుదేరాం నేను, నా మిత్రలు దేవేందర్ త్రిపాఠి, ఇందూరి ప్రవీణ్, గడ్డం అనిల్. స్థానికులు సునిల్, అనిల్‌రెడ్డి, రమణారెడ్డిలు మా ప్రయాణాన్ని సుగమం చేశారు.
మేము దర్శించి హర్షించిన జలపాతాలు గౌరీ గుండం జలపాతం, దాని పరిసర గుండాలైన సీతమ్మ కొల్లుగుంట, పులిగుండం మరియు రాముని గుండాలు. ఇవన్నీ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ రామాయణ కాలపు నేపథ్యగానాలున్నాయి. మొదటి మూడు గుండాలు హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సబ్బితం మీదుగా ప్రయాణిస్తే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన గౌరీ గుండం సులువుగా చేరుకొని ఆనందించడానికి అనువుగా ఉంది. ఇక రాముని గుండాల హైదరాబాదు నుండి పెద్దపల్లి, రామగుండం బి-పవర్‌హౌజ్ గడ్డ మీదుగా ప్రయాణిస్తే 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గమ్మతె్తైన గౌరీ గుండం
సబ్బితం నుండి గట్టుసింగారం వైపు కచ్చారోడ్ మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు అడ్డంగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు కొనసాగుతున్న కొండల వరుస పచ్చని అడవులతో కళకళలాడుతూ కనిపిం చి కనువిందు చేస్తుంది. మనం ఆ కొండలకు దగ్గరవుతున్నకొద్దీ ఆ పచ్చని కొండల మధ్యనున్న ఒకే ఒక నల్లని లోయ మన దృష్టిని ఆకర్షి స్తుంది. ఆ నల్లని లోయ మీద దృష్టి నిలుపగానే కొండ లపై నుండి ఆ లోయలోకి దుముకుతూ కనిపించే తెల్లని జలపాతం మన ఉల్లమును జల్లనిపి స్తుంది. ఆ సుందర దృశ్యానికి తోడు ఆ జలపాతపు హోరు మన ఉత్సాహాన్ని ఉరకలు పెట్టి స్తుంది. ఇక ఆగితేనా! మాలో ఒకర్ని విడిచి ఒకరు ఉరుకులు పరుగుల మీద ఆ జలపాతాన్ని చిటికెలో చేరుకున్నాం.సుమారు 150 అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్ర మధ్య భాగం నుండి..
అంటే సుమారు 70 అడుగుల ఎత్తు నుండి పశ్చిమాభిముఖంగా ‘సుయ్’ మని సూటిగా నింగి నుండి నేలకు దుముకుతున్న సుందర దృశ్యం ఈ జలపాతం సొంతం. నయనానందకరం దాని పరిసరం, వీనుల విందు దాని పొందు. కరచరణ స్ఫూరితం దాని చరితం. స్వరపేటిక ప్రేరితం దాని పాటవం, కవి కలానికి ఇంపు దాని సొంపు. దాని సోయగాన్ని చూసి, దాని నడక సవ్వ డిని విని, దాని కింద తడిసి ముద్దయితే తప్ప ఆనందానికి నిర్వచనం లేదనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే, మేము అలాంటి ఆనందానికి పాత్రులమయి చెప్పున్న విషయాలివి.జలపాతపు తెల్లదనమే దాని కింద ఏర్పడిన గుండంలో కూడా కనబడడం, పైగా ఆ గుండం ఎనిమిది అడుగుల కన్నా ఎక్కువ లోతు లేకపోవడంతో ముందుగా మేము అందులోకి దిగి స్నానాలు చేశాం. ఈత కొట్టాం. కేరింతలతో క్రమక్రమంగా ముందుకి వెళ్లి జలపాతపు ధార కిందికి చేరాం.
మా తల, వీపులపై నురగలు గక్కుతూ గమ్మతుత్గా దుముకుతున్న జలధారల స్పర్శానుభూతికి పరవశులమయ్యాం. చిన్నపిల్లలమై మరింత స్వరం పెంచి కేరింతలు కొట్టసాగాం. ఐదు నిమిషాల తర్వాత అకస్మాత్తు జలపాతపు ప్రవాహం పెరిగింది. మొదట భయపడ్డాం. బయటికి పెరుగెత్తుకు రావాలనుకుంటుండగానే మరో వింత జరిగింది. మళ్ళీ అకస్మాత్తుగా జలపాతం తడవలు తడవలుగా చల్లగా ఓసారి, వెచ్చగా ఓసారి పడటం ప్రారంభమైంది. అది గమ్మతె్తైన వింత అను భూతినివ్వ సాగడంతో ఏమైతే అదవుతుందని అలా ఆనందిస్తూ దాని కిందే ఉండిపోయాం. త్రిపాఠిగా రయితే ‘ఇలా జలపాతం కింద ఉంటే అరగంటలో అద్భుతమైన నీటి మసాజ్ అయ్యి చర్మ రోగా లన్నీ మాయమౌతాయి’ అని కితాబిచ్చారు. ప్రవీణ్‌గారు ఫోటోల్లో ఆ అనుభూతులను బంధించారు. అయితే నిజానికి సబ్బితం గ్రామస్థులు చెప్పినట్లే...
మా కేరింతల శబ్దాల ప్రతిధ్వనులు చుట్టూ ఉన్న గుట్టల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన వెచ్చని నీటిని బయటికి లాగాయని అర్థమైంది.
పరిసరాల పారమ్యం
ఈ జలపాతం కుడివైపు ఉత్తరాన ఉన్న గుండుకు గౌరీ విగ్రహం చెక్కించ బడి ఉండడంతో ఆ దేవత పేరు మీదనే ఈ జలపాతానికి గౌరీ గుండం అనే పేరొ చ్చింది. దాని పక్కనే వినాయక విగ్రహముంది .ఈ మొత్తం శిల్ప సముదాయం సప్తమాతృ కలకు సంబంధించింది అయ్యుంటుంది. జలపాతానికి ఎడమవైపు దక్షిణాన 15 అడుగుల ఎత్తున గుట్టలో పలికి నిలువెత్తు గుహను తొలిచి, మూడు స్తంభాలపై ఆలయ పైకప్పు ఉన్నట్లు తీర్చిదిద్ది ఆలయం లోపల ఈశాన్యం మూలలో త్రిమూర్తుల రేఖా చిత్రాలను, మధ్యలో శివలింగాన్ని చెక్కారు. స్తంభాలు అజంతా స్తంభా లను పోలి ఉన్నాయి కాబట్టి, ఈ ఆలయ చరిత్ర సుమారుగా వేయిన్నర సంవత్స రాలనాటిదని చెప్పవచ్చు. ఆలయం ముందు వాయువ్యంలో జలపాతం తుంపర్లలో తడు స్తున్న బండకు పద్మా సన స్థితిలో కూర్చున్న జైనమాత తీర్థంకర విగ్రహం, దానికి కుడివైపున నాగబంధం, నెమలి, సూర్యచంద్రుల శిల్పాలు చెక్కి ఉన్నాయి.
ఈ ఆలయ సముదాయ శిల్పాలను స్థానికులు గొల్లభామలు అంటున్నారు. జలపాతపు కొండపైన శిధిలమైన ‘బయ్యన్నగుడి’ అనే జైన దేవాలయం ఉంది. ఈ జైన వాస్తు శిల్ప సాంప్రదాయం రాష్టక్రూట రాజుల కాలానిది (క్రీ.శ. 10-11 శతాబ్దాలది) అయ్యుంటుంది. బయ్యన్నగుడికి అల్లంత దూరంలో ‘మామిడికుంట’ అనే చెరువుంది. దాని పరిసరంలో సుమారు రెండు వందల ఎకరాల భూమి ఉంది. దాన్నంతటినీ సాగు చేయవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామస్థులకు కూలీలిచ్చి కొన్ని ఎకరాల భూమిని సేద్యయోగ్యం చేయించారు. ఫలితంగా ప్రస్తు తం సుమారు 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు కూడా. అక్కడికి వెళ్ళేందుకు కూడా కొండ మీదకి ఏటవాలును బట్టి రైతులు, పశువులు వెళ్ళే మార్గం కూడా ఏర్పరచుకు న్నారు. కొండపైన ఇలా వందల ఎకరాల సమతలం ఉండడం, మిగతా ప్రపంచంతో మాత్రం సంబంధం లేకుండా ఉండడం.
ఇవన్నీ చూస్తే ‘ఆకాశంలో ఐలాండ్’ను చూస్తున్నట్లుంది.ఇక ఓపికున్నవారు ఈ జలపాతానికి దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సీతమ్మ కొల్లుగుంట’ అనే గుండాన్ని, ఉత్తరాన ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ‘పులిగుండం’ అనే గుంఆన్ని కూడా చూడవచ్చు. వాటి ప్రాకృతిక సౌందర్యాన్ని చూసి వాటి వద్దకు నడిచిన శ్రమను మరచిపోతాం.
రాముని గుండాలు
రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపైనున్న ‘రామగుం డం’ అనే చెరువు. ఈ చెరువు కొన్ని కిలోమీటర్ల పొడ వుతో దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు కొనసాగుతున్న కొండ వరుస మధ్యలో ఉంది. వర్షాలు ఎక్కువైనప్పుడు ఆ చెరువు నిండి పొంగే ప్రవాహం ఉత్తరం వైపుకు లోయ మార్గంలో ప్రవహిస్తూ ఒక కొండ కొన మెట్ల మీద నుంచి దుము కుతూ మూడు నాలుగు దఫాలుగా చిన్న చిన్న జలపాతా ల్లాగా దర్శన మిస్తుండి. ఆ జలపాతాల కింద రెండు నుంచి నాలుగు గజాల వ్యాసంతో అందమైన గుండాలే ర్పడ్డాయి. ఇవే ‘రాముని గుండాలు’. ఈ గుండాల్లో నిలబడి జలపాతాల కింద జలకాలా డడం మధురాను భూతినిచ్చింది.
గుండాల ఒడ్డు మీద కూర్చుని గుండంలోకి కాళ్ళు జారవిడిచి ఆ నీళ్ళల్లో ‘చలక్ చలక్’ మని కొట్టడం.. నడవడం... ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకోవడం... ఈ చిలిపి చిన్నారి పనులన్నీ పెద్దలకు కూడా ఇక్కడ సాధ్యమే.గుండాల్లో నుంచి పారుతున్న నీళ్ళన్నీ ఇరుకైన రాతి లోయలో నుంచి తూర్పు వైపున కుంటలోకి చేరుతున్నాయి. రెండు గుట్టల పదాల మధ్య ఆ కుంట చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని మరింత ఆస్వాధించాలం టే ఆ కుంటలో చిన్న చిన్న బోట్లు ఏర్పాటు చేయాలి. కొండ పైనున్న గుం డంలో కూడా ఈ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికైతే కొండ పైనున్న ఈ గుండం వరకు ఒక కిలోమీటరు దూరం వరకు ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు.
పరిసరాల వైశిష్ట్యం
రాముని గుండాల వైపు వెళ్తున్నప్పుడు గుట్ట కింద తూర్పుకాభిముఖంగా ఒక వీరగల్ విగ్రహ ముంది. స్థానిక ప్రజల సంరక్షణ కోసం శత్రు సైన్యాలతో యుద్ధం చేసి వీరమరణం పొందినవారి త్యాగాన్ని స్మరించుకోవడం కోసం మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి వీరగల్ విగ్రహాలను ప్రతిష్టించేవారు - సాధారణంగా యుద్ధం జరిగిన ప్రదేశంలోనే. ఈ విగ్రహానికి ఇప్పుడేమో భక్తులు జాజు పూసి దాన్ని హనుమంతుడుగా పేర్కొంటున్నారు. ఈ వీరగల్ విగ్రహం దాటి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆరు అడుగుల ఎతె్తైన ఏకశిలా వినాయక విగ్రహ ముంది. అది ఈ మధ్యనే వర్షాల వరదలో గుట్టపై నుండి కిందికి దొర్లి పడిందట. ఆ విగ్రహ శైలీ విశేషాలను బట్టి అది కనీసం వేయి సంవత్సరాలకు ముందటిదని అర్థమువుతుంది.
వినాయక విగ్రహంలాగే కొండ మీద వేంకటేశ్వర విగ్రహం కూడా బయటపడిందట. అక్కడికి వినా యక విగ్రహం దాటి కొండ ఎక్కి వెళ్ళాలి. ఆ విగ్రహానికి ఆలయం కట్టించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముందుకొచ్చారట. కాని స్థానిక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారు ఆ పనిని తామే చేస్తామని ముందుకొచ్చి మూడు కోట్ల రూపాయలతో ప్రస్తుతం కొండపైకి రోడ్లు వేయిస్తున్నారు. కొండ శిఖరాగ్ర భాగాన ఒక అందమైన శిలా మండపం ఉంది. దీన్ని గౌరీ మంటపం అంటున్నారు. ఇది రోడ్ మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా కనిపిస్తుంది. ఈ రాముని గుండాల రాతి గుట్టలు చాలా ప్రత్యేకమైనవి, అరుదైన అందంతో అరారుతున్నవి.
చాలా భాగం వరకు చెట్లు లేకుండా ముడి ఇనుప గుట్టల్లాగా కన్పిస్తాయి. వీటిల్లో అక్కడక్కడా గుహలేర్పడ్డాయి. వాటిలో విగ్రహాలను పెట్టి వాటి చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు కట్టారు. మొదట ఈ ప్రాంతం నాగజాతి వారిదేమో - అందుకే నాగశిల్పాలు అరడజనుకు పైగా వివిధ రూపాల్లో ఉన్నాయి. తరువాత ఇక్కడికి రాముడు వచ్చిన నిదర్శనంగా ఇక్కడ ప్రధాన రామాల యం ఉంది. ఇక్కడి గుండాల్లో రాముడు సీత ఆనందించారనడానికి నిదర్శనంగా ఇక్కడ రాముడు -సీత ఆలింగన శిల్పాలు అరఫీటు ఎత్తుతో కన్పిస్తున్నాయి. రామాలయం పక్కన రామానుజస్వామి విగ్రహముంది. దాని పక్కన ఒక గుహాలయముంది.
ఈ ఆలయాలకు ముందు శైవ శాక్తేయ మత విశిష్టతను విశదపరిచే నంది, లింగం, కాలభైరవ, శక్తి తదితర శిల్పాలు, దేవాలయాలున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ. 10-11 శతాబ్దాలు) కట్టినట్లు వాస్తు విశేషాలనుబట్టి తెలుస్తోంది.ఇలా చారిత్రక ప్రాకృతిక సౌందర్యాలకు ఆలవాలమైన ఈ గౌరీగుండం, రాముని గుండాల జలపాతాలు ప్రకృతీ ప్రియులను అలరిస్తాయనడంలో అనుమానం లేదు.