జైనుల కళారూపం... జైనథ్ దేవాలయం
చారిత్రక కట్టడాలు, ప్రాచీన శిల్పకళకు ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. శాతావాహనుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశ సంస్కృతి, కళలకు నిలయంగా ఉంది. శాతావాహనులు నిర్మించిన వాటిలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో సందేహం లేదు.
జిల్లాలో ఈ ప్రాంతం జైనులకు కేంద్రం కావడంతో జైనథ్ అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న జైనథ్ మండల కేంద్రంలో ఈ ఆలయం ఉంది. సుమారు 15 అడుగుల పొడవు,60 అడ గుల వెడల్పు గల నల్లని రాళ్లతో నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ నల్లటి రాళ్లపై చెక్కిన శృంగార నృత్య శిల్పాలు అలనాటి శిల్ప కళలు, కళారాధనకు గుర్తులుగా నిలుస్తున్నాయి. ఈ మం దిరంలోని దాదాపు 20 అడగుల ఎత్తుగల లక్ష్మీనారాయణ స్వామి విగ్రహంపై మార్చి, ఏప్రిల్ మాసా ల్లో, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సూర్య కిరణాలు నేరుగా పడేవిధంగా మూలవిరాట్‌ను ప్రతిష్ఠించ డం విశేషం. దేవాలయం ముందు భాగంలో ఒక కోనేరు ఉంది.
భక్తులు స్నానాలు చేయడానికి ఈ కోనేరును అప్పట్లో నిర్మించారు. ఈ కోనేరులో సంతానం లేని దంపతులు స్నానాదులు ఆచరించి స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కానీ, ప్రస్తుతం ఈ కోనేరు నిరుపయోగంగా తయారైంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు నిర్వహించిన అనంతరమే ఇక్కడ ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది. జైనథ్ గ్రామం సుమారు 2500 సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చునని చరిత్రకారులు చెబుతారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అలనాటి శిథిలాలు ఇప్పటికి కనిపిస్తాయి. ఒకప్పుడు దీనినే జైనథ్ దేవాలయంగా, సూర్యదేవాలయంగా పిలిచేవారు. అయితే ప్రస్తుతం ఈ దేవాలయాన్ని జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు.
ప్రాచీనకాలంలో ఈ దేవాలయాన్ని ఒకే రాత్రిలో నిర్మించా రని పలువురు చెబుతుంటారు. అందుకే కొంత భాగం ఇంకా అసంపూర్తిగా ఉందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆలయం కొద్దికొద్దిగా భూమిలోకి కుంగి పోతున్నది . పురా తన కట్టడాలకు, అలనాటి శిల్ప కళలకు నిలయమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయం దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా నిరాదరణకు గురవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దేవా లయ ఆవర ణలో చెన్నకేశవ ఆలయం శిథిలావ స్థలో ఉండగా, డోలారోహణ మండపం, అమ్మవారి మందిరం నిరూపయోగంగా ఉన్నాయి. అయితే ఆలయానికి వచ్చే ఆదాయం పూజారుల వేతనం, ఇతర ఖర్చులకే సరిపోతుండడంతో నిధుల లేమి కారణంగా ఆదరణ తగ్గిపోతుంది. దేవాలయ ఆధీనంలో 50 ఎకరాల భూమి ఉండగా ఆ భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయమే దీనికి ఆధారం.