కాకరకాయలాంటిదే బోడ కాకరకాయ. ఐనా ఎక్కువ చేదు ఉండదు. చిన్నగా ఉంటుంది. చలికాలంలో లేత అకాకరకాయలు లేదా బోడ కాకరకాయలు విరివిగా దొరుకుతాయి. వాటిని మీ వంటింట్లోకి తెచ్చేసుకోండి మరి. ముందుగా ఆవకాయ పెట్టుకుందాం..
అకాకరకాయలు – 1 kg
నూనె – 1/4 kg
అల్లం వెల్లుల్లి ముద్ద – 1/4 kg
కారం పొడి – 125 gms
జీలకర్ర పొడి – 3 tbsp
మెంతిపొడి – 1 tbsp
ఆవపొడి – 1 tbsp
పసుపు – 1 tsp
ఇంగువ – 1/4 tsp
ఆవాలు – 1/2 tsp
జీలకర్ర – 1/2 tsp
ఉప్పు – 250 gms
నిమ్మరసం – 2 tsp
అకాకరాకాయలను కడిగి తుడిచి అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని లోపలి గింజలు తీసేయాలి. పాన్‌లో మూడు చెంచాల నూనె వేడి చేసి ఈ ముక్కలను వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత దింపేయాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఒక గిన్నెలో పసుపు, కారం పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, ఆవపొడి వేసి ఉండలు లేకుండా కలిపి చల్లారిన నూనెలో వేసి కలపాలి. మొత్తం కలిసాక వేయించిన కాకరముక్కలు, నిమ్మరసం కూడా వేసి కలిపి ఊరనివ్వాలి. ఒక రోజు తర్వాత వాడుకోవచ్చు.