పసికందుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే అతి ప్రమాద కర వ్యాధి న్యుమోనియా(శ్వాసకోశ వ్యాధి). పట్టుమని ఐదేళ్లయినా నిండక ముందే ఎంతో మంది పిల్లలు దీని బారిన పడుతూ ఉంటా రు. పారిశ్రామిక ప్రదేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు, యాంటీబ యాటిక్ మందులు ద్వారా పిల్లలను రక్షించునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆ స్థాయి చైతన్యమే కొరవడింది. ప్రపంచ న్యుమో నియా నివారణదినోత్సవం సందర్భంగా ఆ చైతన్యానికి శ్రీకారం చుడదాం. జీవితకాలమంతా హాయిగా సాగిపోవలసిన శ్వాసక్రియ బాల్యంలోనే మారాం చేస్తే ఏమైపోవాలి? న్యుమోనియా వ్యాధి బారిన పడిన పిల్లలు ఆటపాటల సంగతి అలా ఉంచి శ్వాసతీసుకోవడానికే నానా అవస్థలు పడుతుంటారు. ఈ వ్యాధి సోకిన విషయం తెలియ డంలో కొంత మందికి చాలా సమయం పడుతుంది. దాని వల్ల వ్యాధి తాలూకు దుష్ప్రభావాలు ఎక్కువవుతాయి.
ఏమిటీ సమస్య? :- న్యుమోనియా ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే ఒక శ్వాసకోశ వ్యాధి. శ్వాసనాళాల్లో వాపు మొదలయి వాటిలో కొన్ని రకాల ద్రవాలు నిండిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ద్రవాలు కారణంగా శ్వాసకోశాలు తమ విధులను సక్రమంగా నిర్వ ర్తించలేవు. ఫలితంగా శరీరానికి అందవలసిన ఆక్సిజన్ సక్రమంగా అందకుండా పోతుంది.
ఎక్కడివి ఈ ఇన్‌ఫెక్షన్లు? :- వాతావరణంలో ఉండే పలురకాల సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించి న్యుమోనియా కలిగిస్తాయి. ఈ క్రిముల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లే శ్వాసకోశాలను దెబ్బతీ స్తాయి. అలాగే న్యుమోనియాకు గురైన వారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు అవి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. సహజంగానే మన గొంతులో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. మామూలుగా అయితే దీనివల్ల కలిగే హాని ఏమీ ఉండదు. కానీ, వైరస్‌ల కారణంగా శరీరం బలహీనపడినప్పుడు ఇది కొంత అనారోగ్యానికి దారి తీయ వచ్చు. సక్రమంగా లేని ఎయిర్‌కండీషన్‌లు, వాటర్‌షవర్‌ల వల్ల కుడా ఈ సమస్య రావచ్చు. అలాగే కొన్ని రకాల పక్షుల ద్వారా కూడా మనుషులు న్యుమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఎవరిలో ఎక్కువ? :- న్యుమోనియా వయోభేదం లేకుండా అందరికీ సోకుతుంది. కాకపోతే ఐదేళ్లలోపు పసిపిల్లలు, వృద్ధులు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. పొగ తాగే వారు కూడా ఈ సమస్యకు ఎక్కువగానే గురవుతారు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు, రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వారు కూడా న్యుమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంది. వైరస్‌లే ప్రధాన కారణంగా వచ్చే ఈ సమస్య కొద్ది రోజుల్లోనే తన దుష్ప్రభావాన్ని చూపుతుంది. అన్ని సార్లు కేవలం యాంటీబయోటిక్‌స్‌తోనే ఈ సమస్య ను నయం చేయడం సాధ్యం కాదు. కొన్ని సార్లు ప్రత్యేక చికిత్సలు కూడా అవసరమవుతాయి.
లక్షణాలు :- న్యుమోనియా సోకిన వారిలో ఆకలి బాగా తగ్గిపోతుంది. నిరంతరం జ్వరంతో బాగా నీరసించిపోతారు. ఫ్లూ వ్యాధి లక్షణాలు, న్యుమోనియా లక్షణాలు దాదాపు ఒకేలా వుంటాయి. కాకపోతే న్యుమోనియాలో తరుచుగా దగ్గుతూ ఉంటారు.ఉమ్మి ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు కడుపులో ఒక పక్క నొప్పి కూడా రావచ్చు. బలంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువవుతుంది. ఈ స్థితిలో డాక్టర్‌ను సంప్రదించడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.
చికిత్స ఏమిటి? :- ఈ వ్యాధి చికిత్సలో యాంటీబయాటిక్స్‌దే ప్రధాన పాత్ర. కాకపోతే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా అవసరమవుతాయి. పొగ తాగే అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలి. ఆహారంలో ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ చికిత్సతో న్యుమోనియా త్వరగానే తగ్గిపోతుంది. కాకపోతే నీరసం, నిస్సత్తువ మాత్రం ఆరు వారాలదాకా ఉంటాయి. ఈ స్థితి నుంచి తేరుకోవడానికి కొంత కాలం పూర్తి విశ్రాంతి అవసరం.
నివారణ ఎలా? :- పొగతాగడం ఈ వ్యాధి రావడానికి ఒక ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో పొగ తాగే అలవాటు ఉంటే అది పిల్లలకు న్యుమోనియా రావడానికి కారణమవుతుంది. కొన్ని సార్లు ఫ్లూ వ్యాధి కూడా న్యుమోనియాకు దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ కాలంగా ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమే. ఈ వ్యాధి రాకుండా నివారించే నూమోకాకల్ న్యుమోనియా అనే టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మున్ముందు న్యుమోనియా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.