''సర్వేంద్రియానాం నయనం ప్రధానం'' అన్నారు. మొఖానికి అందాన్ని ఇవ్వటమే కాకుండా ప్రకృతిని చూచే భాగ్యం కళ్ళవల్ల కలుగుతున్నది.
కళ్ళను కవులు రకరకాలుగా వర్ణించారు. మీనాక్షి, విశాలాక్షి, కామాక్ష్మి అని పేరు పెట్టారు. మొఖం చంద్రబింబం అయితే,
ఆ బింబంలో తామర మొగ్గల్లా ఉండేవి నయనాలు.
పిల్లమ్మ కన్నులు బీరపువ్వుల్లు
అబ్బాయికన్నుల్లు కలువ రేకుల్లు
కలువ రేకుల వంటి నీ కన్నులను
కాటుకలు పెట్టితే నీకు అందమ్ము''
-అని ఓ ప్రాచీన కవి పిల్లల కళ్ళను అతి చక్కగా వర్ణించాడు.
అలా కళ్లను గురించి చెప్పాలంటే చాలా అవుతుంది. ఇంత అందమైన అతి ముఖ్యమైన కళ్ళు ఒక్కోక్కసారి తమ అందాన్ని కోల్పోతాయి. అది కళ్ళదిగువన నల్లని వలయాలు ఏర్పడినప్పుడు జరుగుతుంది.కళ్ళకు దిగువన సున్నితమైన చర్మం ఉన్నది కదా! దానికింద వందలకొద్దీ చిన్న చిన్న రక్తనాళాలుంటాయి. తలభాగంలో ఉండే రక్తాన్ని వడగట్టే 'వడపోత'యంత్రాల్లా ఇవి పనిజేస్తాయి.మనం ఎక్కువ శ్రమ చేసినపుడు అలసిపోతాం! లేక ఎప్పుడైనా అనారోగ్యానికి గురవుతాం! ఆ సమయంలో ఈ నాళాల్లోరక్తం సరఫరా వేగం తగ్గుతుంది. అప్పుడు రక్తనాళాలు కొంచెం ఉబ్బిపోతాయి. కళ్ళకు దిగువ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుందనుకున్నాం. అంతే కాకుండా, పలుచగా కూడా ఉంటుంది. రక్తనాళాలు ఉబ్బినప్పుడు ఆ ఉబ్బడం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రక్తం రంగు చర్మంలోనుండి నల్లగా కనిపిస్తుంది కదా! అదే వలయాల్లో నల్లగా దర్శనమిస్తుందన్నమాట!
ఇలా కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడతాయి.